ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేయాల్సిన

అక్టోబర్ 13 నేటి సాక్షి నకిరేకల్ రామగిరి వెంకటేశ్వర్లు

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు సకాలంలో అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిరేకల్ పట్టణంలోని ఇరువై వార్డు కుమ్మరి బజార్‌లో ఉన్న పల్లె దవాఖానా ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటలైనా తెరుచుకోకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు సీజనల్ వ్యాధులు ప్రజలను పట్టిపీడిస్తుంటే.. మరోవైపు వైద్యం అందించాల్సిన దవాఖానాకు తాళం వేసి ఉండటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాల భయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం పేదలకు మరింత భారంగా మారుతోందని స్థానికులు అంటున్నారు.
ప్రభుత్వ దవాఖానాలో వైద్యం అందుతుందనే ఆశతో వచ్చిన రోగులకు తాళం వేసి ఉన్న దవాఖానా దర్శనమివ్వడంతో నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేని పేదలు, సామాన్య ప్రజలు వైద్యం కోసం ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
అసలు ప్రభుత్వ వైద్య సేవలు అందించాల్సిన సమయంలో దవాఖానా ఎందుకు తెరుచుకోవడం లేదు, రోగులకు వైద్యం అందించాల్సిన సిబ్బంది ఎక్కడ ఉన్నారు, సమయపాలనను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు,అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు అండగా నిలవాల్సిన సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం ఆందోళనకరం. సంబంధిత వైద్యాధికారులు వెంటనే స్పందించి పల్లె దవాఖానా పనివేళలను పర్యవేక్షించాలని, వైద్య సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రోగులకు సకాలంలో వైద్యం అందించడం ప్రభుత్వ వైద్య వ్యవస్థ బాధ్యత. ప్రజల ఆరోగ్యంతో నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకుంటారా, లేక పేద రోగులకు ఇలాంటి.ఇబ్బందులు కొనసాగుతూనే ఉంటాయా,వేచి చూడాలి.