నేటి సాక్షి కేసముద్రం
కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరుకొండపల్లి గ్రామ శివారులో ఉన్న మేఘ్య తండాలో మంగళవారం కేసముద్రం పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ (సీసీపీ ) నిర్వహించారు.సుమారు 100 ఇళ్లు కలిగిన ఈ తండాలో సీఐ వై. సత్యనారాయణ ఆధ్వర్యంలో కేసముద్రం ఎస్‌ఐ కె. క్రాంతికిరణ్, నెల్లికుదురు ఎస్‌ఐ జి. కరుణాకర్, ఇనుగుర్తి ఎస్‌ఐ పి. నరేష్,సర్కిల్ పరిధికి చెందిన 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొని ఇంటింటా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో అక్రమ గుడుంబా తయారీకి ఉపయోగించే సుమారు 4,000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు,50 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 50 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు.స్వాధీనం చేసుకున్న నిషేధిత పదార్థాలకు సంబంధించిన వ్యక్తులపై చట్టప్రకారం కేసులు నమోదు చేసే ప్రక్రియ చేపట్టారు.
•గ్రామస్థులకు అవగాహన.
తనిఖీల అనంతరం గ్రామస్థులను సమావేశపరిచి రహదారి భద్రత,రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత మరియు సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై పోలీసులు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా అపరిచిత లింకులు క్లిక్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోకూడదని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, గ్రామంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో ఉపయోగకరమని వివరించారు.ఈ సందర్భంగా సీఐ వై. సత్యనారాయణ మాట్లాడుతూఅక్రమ గుడుంబా తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజల భద్రత, నేరాల నివారణ మరియు పోలీసు–ప్రజల మధ్య సత్సంబంధాల బలోపేతమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గ్రామస్థులు పోలీసులకు సహకరిస్తూ, తమ పరిసరాల్లో అక్రమ కార్యకలాపాలు లేదా అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనించినట్లయితే వెంటనే సమాచారం అందించాలని కోరారు.