పంటలు ఎండిపోతున్నాయి.. రైతుల

నేటి సాక్షి,మోతే

పంటలు ఎండిపోతున్నాయి.. రైతుల పెట్టుబడులు బూడిదవుతున్నాయి.. అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి.. అయినా ప్రభుత్వానికి చలనం లేదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ మండిపడ్డారు. సాగునీరు అందక మోతే మండలంలో వరి పంటలు ఎండిపోతున్నా పాలకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రైతుల కన్నీళ్లు తుడవాల్సిన ప్రభుత్వం వారి కష్టాలను గాలికొదిలేసిందని విమర్శించారు.
మంగళవారం మోతే మండల పరిధిలో సాగునీరు అందక ఎండిపోతున్న వరి పంటలను బొల్లం మల్లయ్య యాదవ్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం లాల్‌ తండా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను సందర్శించి లాగ్‌బుక్‌లను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందుతున్న తీరుపై ఆరా తీశారు. సాగునీరు, విద్యుత్‌ సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.

*కాలువలున్నా నీళ్లెందుకు లేవు?*

రైతులు వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి పంటలు సాగు చేస్తే, చేతికొచ్చే సమయంలో నీరు లేక పంటలు ఎండిపోవడం దురదృష్టకరమని మల్లయ్య యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాలువల్లో నీరు పారించలేని పాలకులు రైతులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కొత్త కాలువల ప్రణాళికల పేరుతో ప్రకటనలు చేయడం కాదని, ఇప్పటికే ఉన్న సాగునీటి వనరుల ద్వారా రైతులకు నీరందించాలని డిమాండ్‌ చేశారు. కొత్త ప్రణాళికలపై ఖర్చులు, కాంట్రాక్టుల గురించి ఆలోచించే ముందు ఎండిపోతున్న పంటలను కాపాడటంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

*నీటిపారుదల మంత్రి ఏం చేస్తున్నట్లు?*

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందకపోవడం ఏమిటని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ప్రశ్నించారు. రైతులకు నీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? కాలువల్లో నీటిని విడుదల చేసి పంటలను కాపాడేందుకు తక్షణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. రైతులు నష్టపోయిన తర్వాత పరామర్శలతో ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను గుర్తించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

*విద్యుత్‌ సరఫరాలోనూ ఇబ్బందులే!*

లాల్‌ తండా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ లాగ్‌బుక్‌లను పరిశీలించిన సందర్భంగా వ్యవసాయ విద్యుత్‌ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై మల్లయ్య యాదవ్‌ ప్రశ్నలు లేవనెత్తారు. సాగునీరు లేకపోవడం ఒకవైపు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు మరోవైపు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అన్నారు. పక్కనే ఉన్న మధిర నియోజకవర్గంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా జరుగుతున్నట్లు చెబుతున్నప్పుడు కోదాడ నియోజకవర్గ రైతులకు కూడా నాణ్యమైన విద్యుత్‌ అందించాలని కోరారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు.

*రైతుల గోడు వినకపోతే పోరాటమే!*

రైతుల సంక్షేమమే లక్ష్యమని చెప్పే కాంగ్రెస్‌ ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానం చెప్పాలని మల్లయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు. రాజకీయ కార్యక్రమాలకే ప్రాధాన్యమిస్తూ రైతుల సమస్యలను పక్కన పెట్టడం తగదని విమర్శించారు. మోతే మండలంలో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు. పంట నష్టపోయిన రైతులను గుర్తించి తగిన పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.
రైతుల కష్టాలను ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోవాలి. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. అన్నదాతల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే రైతుల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం అని బొల్లం మల్లయ్య యాదవ్‌ హెచ్చరించారు.