సనాతన ధర్మ సంప్రదాయాలకు

నేటి సాక్షి,మునగాల

సనాతన ధర్మ సంప్రదాయాలకు ప్రతీకగా, భక్తిభావానికి ఆధ్యాత్మిక వైభవాన్ని అద్దుతూ మునగాల మండలం రేపాల గ్రామంలోని రామా రైస్ మిల్ సెంటర్‌లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు గురువారం శ్రీ అమ్మవారు త్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ, ఆయన సతీమణి నాగమణి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిప్రపత్తులతో మొక్కులు సమర్పించారు.
వేదమంత్రోచ్ఛారణలు, మంగళకరమైన పూజా విధానాల నడుమ అర్చకులు వేదం భద్రయ్య శాస్త్రి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారికి పుష్పాలంకరణ, అర్చన, హారతి తదితర పూజా క్రతువులు భక్తిపూర్వకంగా నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఈ పూజా కార్యక్రమాల్లో గ్రామ మహిళలు, భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలను పొందారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆదిపరాశక్తి అయిన అమ్మవారి అనుగ్రహంతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గ్రామంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పుష్కలంగా పండాలని, రైతుల ఇళ్లలో ధాన్యసంపద వెల్లివిరియాలని, పాడి పరిశ్రమ అభివృద్ధి చెంది గ్రామం సుభిక్షంగా ఉండాలని త్రిపురసుందరి అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామ ప్రజల మధ్య ఐకమత్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, శాంతిసౌభాగ్యాలు నెలకొనాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.
శరన్నవరాత్రి ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలే కాకుండా గ్రామ ప్రజల మధ్య భక్తి, ఐక్యత, సాంస్కృతిక సంప్రదాయాలను పెంపొందించే పవిత్ర సందర్భాలని భక్తులు పేర్కొన్నారు. అమ్మవారి నామస్మరణతో రేపాల గ్రామం భక్తిమయ వాతావరణంలో పూజలు జరుపుతున్నారు.