ఉద్యోగఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన

నేటి సాక్షి కరీంనగర్ అక్టోబర్ 15

ఉద్యోగఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ( ఈ హెచ్ ఎస్ ) హెల్త్ కార్డుల పరిమితిని రూ10 లక్షలకు పెంచాలని, రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వీటిని విధిగా అమలు చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం ఏ ఖాద్రీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
​ఈ సందర్భంగా ఖాద్రీ మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈహెచ్‌ఎస్ ( ఈ హెచ్ ఎస్ ) పథకం అమలు తీరుపట్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి అసహనం నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు జారీ చేస్తున్న హెల్త్ కార్డులు క్షేత్రస్థాయిలో ఉద్యోగుల చేతిలో కేవలం ప్లాస్టిక్ ముక్కలుగానే మిగిలిపోతున్నాయని, అత్యవసర సమయాల్లో ఏమాత్రం ఉపయోగపడటం లేదని విమర్శించారు.
​కార్పొరేట్ ఆసుపత్రుల మొండిఘటం
రాష్ట్రంలోని పలు ప్రముఖ ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఈ హెల్త్ కార్డులను ఖాతరు చేయడం లేదని ఖాద్రీ మండిపడ్డారు. రోగులు ఆసుపత్రులకు వెళ్లి ఈ కార్డును చూపించినప్పుడు యాజమాన్యాలు ముఖం మీదే "ఇక్కడ ఈ కార్డు చెల్లుబాటు కాదు" అని తేల్చి చెబుతున్నాయని ఆయన వాపోయారు. క్యాష్‌ లెస్ వైద్యం కేవలం కాగితాలకే పరిమితమవుతోందని, ఆచరణలో మాత్రం తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయని తెలిపారు.
​పారదర్శకతతో కూడిన వైద్యం అందించాలి
ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం వెంటనే ఉన్నత స్థాయి చర్చలు జరపాలని ఖాద్రీ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అస్పష్టతకు, అనుమానాలకు తావు లేకుండా ఓపీ వైద్య పరీక్షలు, ఐపీ తో పాటు అన్ని రకాల మందుల సౌకర్యాలను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఈ పథకం అమలులో పూర్తి పారదర్శకత ప్రదర్శించాలని ఆయన డిమాండ్ చేశారు.