మంత్రాలయం మండలంలోని చెట్లహళ్లి

నేటి సాక్షి న్యూస్ రిపోర్టర్ మంత్రాలయం అక్టోబరు 15



మంత్రాలయం మండలంలోని చెట్లహళ్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు వరప్రసాద్, ఉపాధ్యాయుడు అబ్దుల్లాపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ నాయుడు, యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కన్వీనర్ ఉదయ్ కుమార్, ఆర్‌పీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్రిది, పీఆర్‌ఎస్‌వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్, ఆర్‌ఏవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ.. చెట్లహళ్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఇద్దరు ఉపాధ్యాయులపై ఆరోపణలు వచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఆదోని డిప్యూటీ డీఈఓ రాజేంద్రప్రసాద్‌తో పాటు బాలికా శిశు అభివృద్ధి శాఖ అధికారులను నియమించగా, వారు విచారణ పూర్తి చేసి నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేసినట్లు పేర్కొన్నారు.

అయితే విచారణ నివేదిక అందినప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని నాయకులు ప్రశ్నించారు. విచారణ పేరుతో కాలయాపన చేయకుండా, మహిళా ఉపాధ్యాయులకు, విద్యార్థినులకు రక్షణ కల్పించేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకపోతే త్వరలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రంజిత్, మంజు తదితరులు పాల్గొన్నారు..