నేటి సాక్షి, తిమ్మాపూర్:
తెలంగాణ రాష్ట్ర ప్రముఖ పండుగ అయిన బతుకమ్మ వేడుకల కోసం చేపట్టిన అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్ చేతివాటం ప్రదర్శించాడు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో నాసిరకం డస్ట్ పోసి వేలల్లో సొమ్ము కూడా పెట్టుకుంటున్నాడు.
*నాణ్యత లేని డస్ట్..*
బతుకమ్మ ఆడే మహిళల కాళ్లకు ఎలాంటి గాయాలు కాకుండా ఉండేందుకని డస్ట్ పోసేందుకు సదరు కాంట్రాక్టర్ టెండర్ వేశాడు. అయితే ఆ కాంట్రాక్టర్ తాను పనులు చేయకుండా వేరొకరికి అప్పగించాడు. డివిజన్లోని దాదాపు 33 ప్రాంతాల్లో డస్ట్ పోయాలని కార్పొరేటర్ కాల్వ మల్లేశం అధికారులకు సూచించారు. అయితే ఇదే అదునుగా భావించిన మట్టి కలిసిన డస్ట్ ను బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో పోయడంతో కార్పొరేటర్ సీరియస్ అయ్యారు.
*ఏఈ, డీఈకి పిర్యాదు..*
నాసిరకం పనులపై సీరియస్ అయిన కార్పొరేటర్ కాల్వ మల్లేశం మున్సిపల్ ఏఈ, డీఈకి పిర్యాదు చేశారు. దీంతో డివిజన్ చేరుకున్న అధికారులు మట్టి కలిసిన డస్ట్ పోయవద్దంటూ కాంట్రాక్టర్ కు సూచించారు. వెంటనే నాణ్యమైన డస్ట్ పోయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. కాగా, బతుకమ్మ వేడుకలకు పోసే డస్ట్ లో సైతం కమీషన్లకు కక్కుర్తి పడుతున్న సదరు కాంట్రాక్టర్ పై డివిజన్ ప్రజలు సీరియస్ అవుతున్నారు. ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో నాణ్యతను పాటించకపోవడంపై మండిపడుతున్నారు.