నేటి సాక్షి, అనంతగిరి:(సతీష్ నాయక్)
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామంలో మోటార్ వైర్ల దొంగలు రెచ్చిపోతున్నారు. గత కొన్ని నెలలుగా వ్యవసాయ భూముల్లోని మోటార్లకు అమర్చిన వైర్లను దొంగలు ఎత్తుకెళ్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో అర్ధరాత్రి సమయంలో చొరబడుతున్న దొంగలు మోటార్లకు అనుసంధానించిన కాపర్ వైర్లు, స్టార్టర్లు, కేబుల్ వైర్లను కట్ చేసి అపహరిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. పంటలకు నీరు అందించేందుకు రైతులు వేలాది రూపాయలు వెచ్చించి మోటార్లు, వైర్లు ఏర్పాటు చేసుకుంటే.. దొంగలు వాటిని రాత్రికి రాత్రే ఎత్తుకెళ్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే పలువురు రైతుల పొలాల్లో ఇదే తరహా చోరీలు జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఒక్కో రైతుకు సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగిలించిన వైర్ల స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడం రైతులకు ఆర్థిక భారంగా మారుతోందని, మోటార్లు పనిచేయక పంటలకు సకాలంలో నీరు అందక పంట నష్టాలు కూడా సంభవిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు.
*మోటార్ వైర్ల చోరీలతో విసిగిపోయిన రైతులు*
రాత్రిపూట పొలాల వద్ద కాపలా ఉండాల్సిన దుస్థితి నెలకొంది. వ్యవసాయ పనులు చూసుకోవాల్సిన సమయంలో దొంగల భయంతో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*పోలీసులు స్పందించాలి.. దొంగల బెడదకు అడ్డుకట్ట వేయాలి!*
గొండ్రియాల గ్రామంలో వరుసగా జరుగుతున్న మోటార్ వైర్ల చోరీలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. వ్యవసాయ పొలాల వద్ద రాత్రిపూట పోలీసు గస్తీ పెంచడంతో పాటు, చోరీలకు పాల్పడుతున్న దొంగలను గుర్తించి పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల కష్టార్జితాన్ని కాపాడేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.