నేటి సాక్షి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ సంబరాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల పూల బతుకమ్మలతో కోలాటాలు ఆడారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఫిరోజ్ ఖాన్, సామాజిక కార్యకర్త ఏల్లుల సంతోష్ కుమార్ హాజరయ్యారు. అనంతరం బ్రహ్మకుమారి రేవతి దీదీ మాట్లాడుతూ.. రంగురంగుల విభిన్న పూలను ఐక్యంగా పేర్చి బతుకమ్మను అందంగా తీర్చిదిద్దినట్లే, సమాజంలో పౌరులంతా విబేధాలను విడనాడి ప్రేమాభిమానాలతో కలిసిమెలిసి జీవించాలనే గొప్ప సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందని తెలిపారు. ఆధ్యాత్మికత, పవిత్రత, ప్రకృతి పరిరక్షణకు బతుకమ్మ ఉత్సవాలు ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాబాహుళ్యమంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఆశ్రమ బ్రహ్మకుమారీలు, భక్తులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.