నేటి సాక్షి, ధర్మారం: టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ (టీఎఫ్వైసీ) 4.0లో భాగంగా నంది మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ ఉప్పులేటి సుస్మిత ఆధ్వర్యంలో గురువారం ధర్మారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు పొగాకు ఉత్పత్తుల వినియోగం, వాటి అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుస్మిత మాట్లాడుతూ.. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, టీబీ, కంటి చూపు మందగించడం, సంతానలేమి, నోటి క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ వ్యాధుల్లో చాలా వరకు నివారించగలిగేవేనని, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. భారత ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ యూత్ టొబాకో సర్వే (జీటీవైఎస్) 2009, గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే (జీఏటీఎస్) 2016-17 వివరాల ఆధారంగా పొగాకు వినియోగ తీవ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో, వాటి చుట్టూ 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల వినియోగం, విక్రయాలు జరగకుండా చూడాలని సూచించారు. నిబంధనలు పాటించే పాఠశాలలకు టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ (టోఫీ) గుర్తింపు లభిస్తుందని తెలిపారు. పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగం నిషేధమని, మైనర్లకు వాటిని విక్రయించకూడదని సూచించారు. పాఠశాలల 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు నిషేధమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కోట్పా-2003 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. అక్టోబర్ 28 నుంచి 60 రోజులపాటు గ్రామాలు, కమ్యూనిటీలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు సామాజిక, ఆర్థిక భద్రతను మెరుగుపరచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈవో నరసింహారెడ్డి, హెల్త్ అసిస్టెంట్ దామోదర్ రెడ్డి, ఆశా కార్యకర్త రూప, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.