ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందస్తు

నేటిసాక్షి, మిర్యాలగూడ :
రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని సమిష్టిగా కృషి చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) పిలుపునిచ్చారు. సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కంటే, సమస్య రాకముందే అప్రమత్తమై అవసరమైన చర్యలు తీసుకోవడమే బాధ్యతాయుతమైన పాలనకు నిదర్శనమని అన్నారు.
ఎల్‌నినో ప్రభావం, దాని వల్ల ఎదురయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై మిర్యాలగూడ పట్టణంలోని కళావేదికలో శుక్రవారం నియోజకవర్గ స్థాయి కార్యక్రమన్ని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, రాబోయే నెలల్లో ఎల్‌నినో ప్రభావం తీవ్రతరం అయ్యే అవకాశాల నేపథ్యంలో ప్రజలు, పశువులు, వ్యవసాయ రంగాన్ని కరువు పరిస్థితుల నుంచి కాపాడేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని సూచించారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 537 అడుగులకు పడిపోయిందని, డెడ్‌ స్టోరేజీకి ఎగువన సుమారు 55 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నీటిని హైదరాబాద్‌ తాగునీటి అవసరాలతో పాటు ఇతర అత్యవసర అవసరాలకు వినియోగించాల్సి ఉన్నందున రాబోయే యాసంగి సీజన్‌లో సాగునీరు అందించే అవకాశం లేదని స్పష్టం చేశారు.
రైతులు ఈ పరిస్థితిని గుర్తించి కేవలం బోర్లపై ఆధారపడి వరి సాగు చేసి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే జొన్నలు, పెసర్లు, మినుములు తదితర ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతు వేదికల ద్వారా పంటల మార్పిడి, మార్కెట్‌ డిమాండ్‌, లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలు, మున్సిపల్‌ వార్డుల్లో ఎల్‌నినో ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. నీరు, విద్యుత్‌, భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించేలా ప్రజలను చైతన్యపరచాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, బస్టాండ్లు, జనసమ్మర్థ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
పశుగ్రాసం కొరత రాకుండా రైతులు ముందుగానే నిల్వలు ఏర్పాటు చేసుకోవాలని, వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి నిల్వ నిర్మాణాలు, కాలువల మరమ్మతులు చేపట్టాలని అన్నారు. ప్రతి ఇంటిపై పడే వర్షపు నీటిని వృథా కాకుండా భూగర్భ జలాల పెంపునకు వినియోగించాలని సూచించారు. దామరచర్ల పెద్ద చెరువును మూసీ నది నీటితో నింపే అవకాశాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

12 నెలల జీతం ప్రజాసేవకు అంకితం...

రాబోయే కరువు పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో తన 12 నెలల జీతాన్ని బీఎల్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. వచ్చే జనవరి నుంచి ప్రజలకు తాగునీటితో పాటు పెరుగన్నం అందించే కార్యక్రమాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడతామని తెలిపారు. ప్రజలకు కష్టకాలంలో అండగా నిలవడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని స్పష్టం చేశారు.
గతంలో రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ నమోదైనప్పటికీ, రైతుల పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు చేసి సరఫరా చేసిందని గుర్తుచేశారు. దామరచర్లలో యాదాద్రి విద్యుత్‌ కేంద్రం నిర్మాణం వల్ల ప్రజలపై దీర్ఘకాలిక ఆర్థిక భారం పడిందని, 2015లో అప్పటి ప్రభుత్వం తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీలకు పరిమితం చేయడం ద్వారా దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
గ్రామాల్లో ఉపాధి కోల్పోకుండా సంక్రాంతి నాటికి రహదారులు, కాలువల మరమ్మతులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వికసిత్‌ భారత్‌ గ్రామీణ రోజ్‌గార్‌ అభియాన్‌ కింద 2026–27 సంవత్సరంలో రూ.6,311 కోట్లతో 11 కోట్ల పనిదినాల కల్పనకు సంబంధించిన కార్యక్రమాలను వివరించారు.

ముందస్తు కార్యాచరణ రూపొందించాలి: జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో నీటి వనరులు, వాటి నిల్వ సామర్థ్యం, ఎంతకాలం నీరు అందుబాటులో ఉంటుందనే వివరాలతో నీటి వనరుల పరిశీలన చేపట్టాలని సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
నీటి లీకేజీలను అరికట్టి ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలన్నారు. ఇంకా ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించి నీటి నిల్వ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాన్ని, ప్రతి శుక్రవారం జరిగే రైతుల అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న, తక్కువ కాలవ్యవధిలో పండే పంటలను సాగు చేయాలని, వాటికి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి ఎల్‌నినో ప్రభావం, వివిధ శాఖలు చేపట్టాల్సిన ముందస్తు చర్యలను వివరించారు. వ్యవసాయం, భూగర్భ జలాలు, ఉద్యానవనం, తాగునీరు, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులు తమ కార్యాచరణను వివరించారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధ, వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీష, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.