మీడియాలో ప్రసారమవుతున్న కథనాలను

నేటి సాక్షి,అందోల్-జోగిపేట:

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ శాంగ్రిలా హోటల్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుందంటూ మీడియాలో ప్రసారమవుతున్న కథనాలను అందోల్-జోగిపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) తీవ్రంగా ఖండించారు. మంత్రి దామోదర రాజనర్సింహపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇలాంటి నిరాధార ప్రచారాలను ప్రజలు విశ్వసించరని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు, అసత్య ప్రచారాలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించడం సమాజానికి మేలు చేస్తుందని అన్నారు. అందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ నాయకత్వంలో సుమారు రూ.2,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదన్నారు.

*పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు పడతాయి..!*

ప్రజలకు సేవ చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న నాయకులపై విమర్శలు రావడం సహజమని, అయితే వాటికి ఆధారాలు ఉండాలని ఆకుల సత్యనారాయణ అన్నారు. "మా నాయకుడిపై వచ్చే లేనిపోని వార్తలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన సహనం, ఓర్పు, క్రమశిక్షణ ప్రతి ఒక్కరూ చూసి నేర్చుకోవాలి. ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండాలనే గొప్ప లక్షణం దామోదర రాజనర్సింహ గారిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఆయన తన రాజకీయ ప్రస్థానం ద్వారా ఎన్నో విలువలు నేర్పించారు. అలాంటి నాయకుడిపై నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరం" అని పేర్కొన్నారు.

*బీఫాం ఇచ్చిన నాయకుడి గౌరవాన్ని మరిచిపోవద్దు..!*

రాజకీయాల్లో ఎదగడానికి అవకాశం కల్పించిన నాయకుడి పట్ల కనీస కృతజ్ఞత, గౌరవం కలిగి ఉండాలని ఆకుల సత్యనారాయణ హితవు పలికారు. లేనిది ఉన్నట్లు చూపిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేస్తున్న ప్రచారాలను ఇకనైనా మానుకోవాలని హెచ్చరించారు.

"బీఫాం ఇచ్చి రాజకీయంగా నిలబెట్టిన నాయకుడి గౌరవాన్ని మరిచి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఒక నాయకుడు అవకాశం కల్పిస్తేనే రాజకీయ ప్రయాణానికి బాటలు పడతాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పదవులు పొందిన తర్వాత అదే నాయకుడిపై విమర్శలు చేయడం సరైన రాజకీయ సంస్కృతి కాదు. రాజకీయాల్లో ఎదగడం తప్పు కాదు.. పదవులు అనుభవించడం తప్పు కాదు.. కానీ మన ఎదుగుదలకు బాటలు వేసిన నాయకుడి పట్ల కృతజ్ఞతను మరిచిపోవడం మాత్రం రాజకీయ అహంకారానికి నిదర్శనం" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

*అభివృద్ధి పనులపై చర్చించండి.. అసత్య ప్రచారాలు కాదు..!*

అందోల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, రహదారులు తదితర రంగాల్లో అభివృద్ధికి మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాధాన్యతనిస్తున్నారని ఆయన తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం జరుగుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, వాటిని పక్కనపెట్టి వ్యక్తిగత ఆరోపణలు, వివాదాలకు ప్రాధాన్యత ఇవ్వడం బాధాకరమన్నారు.

ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శల కంటే ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, నాయకుల మధ్య వివాదాలను కాదని స్పష్టం చేశారు.

మా నాయకుడి ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేయొద్దు!

"ఒక్క విషయం గుర్తుంచుకోండి.. బీఫాం ఇవ్వడం నాయకుడి గొప్పతనం.. గెలిపించుకోవడం ప్రజల గొప్పతనం.. ఎదిగాక కృతజ్ఞత మర్చిపోవడం మాత్రం రాజకీయ అహంకారం. మా నాయకుడు దామోదర రాజనర్సింహ గారి గౌరవం, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా నిరాధార ప్రచారాలు చేస్తే సహించేది లేదు. ఆయన నాయకత్వాన్ని అసత్య ఆరోపణలతో తగ్గించలేరు. ఆయన వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆత్మగౌరవాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయకూడదు. రాజకీయాల్లో విమర్శలకు స్వాగతం పలుకుతాం.. కానీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, వాస్తవాలు లేని ఆరోపణలతో ప్రచారం చేయడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తాం" అని ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) స్పష్టం చేశారు.

ఇకనైనా రాజకీయ నాయకులు పరస్పర గౌరవం పాటిస్తూ, ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలని ఆయన కోరారు.