నేటి సాక్షి న్యూస్ రిపోర్టర్ నవంబర్ 02
కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దకడబూరు పోలీసులు హెచ్చరించారు. నవంబర్ 5, 2026న జరగనున్న MPTC, ZPTC ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
ఎవరైనా అభ్యర్థులు, వారి అనుచరులు లేదా ఇతర వ్యక్తులు ఓటర్లకు డబ్బులు, మద్యం, బహుమతులు, వస్తువులు పంపిణీ చేయడం ద్వారా ఓట్లను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పేర్కొన్నారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు కోరారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎక్కడైనా అక్రమాలు, ప్రలోభాల పంపిణీ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పెద్దకడబూరు పోలీసులు పిలుపునిచ్చారు.