కార్యదర్శిని లక్ష్యంగా చేసుకుని వేధింపులా?

నేటి సాక్షి చిలుకూరు

సూర్యాపేట జిల్లా చిలుకూరు: మండలంలోని గ్రామపంచాయతీకి సంబంధించిన స్థల మార్పిడి వ్యవహారం ఇప్పుడు పలు ప్రశ్నలకు తావిస్తోంది. పంచాయతీ కార్యదర్శికి ప్రత్యక్ష ప్రమేయం లేదని చెబుతున్నప్పటికీ, ఈ వ్యవహారంలో ఆయన పేరును ప్రస్తావిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు స్థల మార్పిడి ఎలా జరిగింది? ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? సంబంధిత రికార్డుల్లో ఏముంది? అనే ప్రశ్నలకు అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
పోలీసులకు ఫిర్యాదు.. అయినా స్పందన కరువు
స్థల మార్పిడి వ్యవహారంపై పోలీస్ స్టేషన్‌లో పిటిషన్ సమర్పించినట్లు సమాచారం. ఫిర్యాదు అందిన నేపథ్యంలో సంబంధిత పత్రాలు, పంచాయతీ రికార్డులు, స్థలానికి సంబంధించిన వివరాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి...
ప్రమేయం లేని కార్యదర్శిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?
ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని చెబుతున్న పంచాయతీ కార్యదర్శిని వివాదంలోకి లాగడం వెనుక కారణమేంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారిక విధుల్లో భాగంగా పనిచేసే కార్యదర్శిపై ఆరోపణలు వస్తే, వాటిని రికార్డుల ఆధారంగా నిర్ధారించాలి. ఆధారాలు లేకుండా ఒక ఉద్యోగిని పదేపదే వివాదంలోకి లాగడం వల్ల ఆయన విధులు నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రికార్డులే అసలు సాక్ష్యం.. విచారణ ఎప్పుడు?
పంచాయతీ స్థలానికి సంబంధించిన రికార్డులు, తీర్మానాలు, సంబంధిత అనుమతులు, స్థల మార్పిడి ప్రక్రియకు సంబంధించిన పత్రాలను అధికారులు సమగ్రంగా పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తులపై ఆరోపణలు చేయడం కంటే రికార్డుల ఆధారంగా బాధ్యత ఎవరిదో నిర్ధారించాల్సిన అవసరం ఉంది.
అధికారుల మౌనం అనుమానాలకు తావిస్తోందా? ఈ పరిస్థితుల్లో
పంచాయతీ కార్యదర్శికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో మరో మారు ఫిర్యాదు ను కార్యదర్శి నవీన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మోహన్ బాబు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి స్పష్టమైన విచారణ చేయడంతో పాటు బాధ్యులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలను తీసుకుంటామన్నారు.