* కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు

*నేటి సాక్షి, ధర్మారం:* ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన నాయకులను పోలీసులు అరెస్టులు, నిర్బంధాలతో అణచివేస్తున్నారని బీఆర్‌ఎస్‌వీ నేత దేవి వంశీకృష్ణ ధ్వజమెత్తారు. ధర్మారం మండలానికి చెందిన విద్యార్థి నాయకుడు వంశీకృష్ణతో పాటు మరికొందరిని పోలీసులు అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసాన్ని బీఆర్‌ఎస్‌వీ నాయకులు ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతోనే తనను ముందస్తుగా అరెస్టు చేసినట్లు ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును అడ్డుకునేందుకు అర్ధరాత్రి అరెస్టులకు పాల్పడటం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన నాయకులను నిర్బంధాలతో అణచివేయాలని చూడటం తగదని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను అరెస్టులతో ఆపలేరని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లతో పాటు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీల అమలులో పూర్తిగా విఫలమైందని వంశీకృష్ణ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన గులాబీ జెండా పట్టుకుని రేవంత్‌ సర్కారుపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై హత్య కుట్ర, ఫామ్‌హౌస్‌పై దాడి ప్రయత్నం వంటి ఘటనలపై స్పందిస్తూ.. కేసీఆర్‌కు ఏ హాని జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. ఆయనకు రక్షణగా నిలిచి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, యువత హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని వంశీకృష్ణ పేర్కొన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో విద్యార్థి, యువజన నాయకులు దేవి వంశీకృష్ణతో పాటు కంపెల్లి చందు, బోయిని రాజు, తిరుపతిలు ఉన్నారు.