భూనిర్వాసితుల సమస్యలపై కొట్టాల యాదగిరి ఫైర్”

నేటి సాక్షి గజ్వేల్: --

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన నిరుద్యోగులు, సబ్బండ వర్గాల ఆకాంక్షలు నేటికీ నెరవేరలేదని టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు, గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కొట్టాల యాదగిరి అన్నారు. తెలంగాణ ఉద్యమం ఎన్నో త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యమకారులు, నిరుద్యోగులు, భూనిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. ప్రజల ఆకాంక్షలను సాధించేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమవుతోందని ఆయన స్పష్టం చేశారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ఏటిగడ్డ కిష్టపూర్ వద్ద తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను కొట్టాల యాదగిరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు, పుట్టిన ఊర్లను త్యాగం చేసిన భూనిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల త్యాగాల ఫలితంగానే రాష్ట్రంలోని ప్రజలకు తాగునీరు అందుతోందని, కానీ రాష్ట్ర ప్రజల దాహం తీర్చిన వారి కుటుంబాలు మాత్రం నేడు కన్నీళ్లతో జీవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కన్నతల్లి లాంటి పుట్టిన ఊరును, తరతరాలుగా తమ కుటుంబాలను ఆదరించిన భూములను వదిలి దిక్కుతోచని స్థితిలో కొత్త ప్రాంతాల్లో జీవనం సాగించాల్సిన పరిస్థితి భూనిర్వాసితులకు ఏర్పడిందని కొట్టాల యాదగిరి అన్నారు. పుట్టిన నేలపై ఉన్న అనుబంధాన్ని, తమ జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలవాల్సి ఉండగా పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఉపాధి లేక అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో అర్ధాకలితో జీవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భూనిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీలు, ఇతర హామీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తమ సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు సైతం నిర్వాసితులను కార్యాలయాల చుట్టూ తిప్పుతూ మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. భూములు కోల్పోయి, జీవనాధారాన్ని త్యాగం చేసిన కుటుంబాలకు న్యాయం చేయడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని అన్నారు. నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి రావాల్సిన ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం భూనిర్వాసితులను నమ్మించి మోసం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చి మోసం చేస్తోందని కొట్టాల యాదగిరి ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కాకపోవడంతో నిర్వాసితులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు అమలు చేయకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. భూనిర్వాసితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం పుట్టిన టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల సమస్యలపై మరోసారి గళమెత్తేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు, భూనిర్వాసితులు, సబ్బండ వర్గాలు ఏకతాటిపైకి వచ్చి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎల్లప్పుడూ మొదటి స్థానం ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారని, సబ్బండ వర్గాలు తమకు రావాల్సిన హక్కులు, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని కొట్టాల యాదగిరి అన్నారు. తెలంగాణ సాధన సమయంలో ప్రజలు కన్న కలలను, ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు.
అంతకుముందు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చేరుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు పగిడాల శ్రావణి, విజయలక్ష్మి, ఎంపీటీసీ నర్సింలు, కూరాకుల శ్రీకాంత్, లింగని రాజు, కనకరాజు, నాంపల్లి, స్వామి, మధు, కుమార్‌, అశోక్, కనకసేన తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.