నేటి సాక్షి, ధర్మారం: ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం నంది మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ వైద్యాధికారిని డాక్టర్ యు. సుస్మిత 105 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దగ్గు, జలుబు, జ్వరం, బీపీ, షుగర్ తదితర ఆరోగ్య సమస్యలకు పరీక్షలు చేసి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుస్మిత మాట్లాడుతూ.. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం గ్రామంలోని రాంనగర్ ప్రాంతంలో ఫ్రైడే - డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. హెల్త్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ నరసింహారెడ్డి ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తొలగించి దోమల వృద్ధిని అరికట్టాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో అనేక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ జీవరాణి, హెల్త్ అసిస్టెంట్ దామోదర్, ఏఎన్‌ఎంలు స్వరూప, రాజేశ్వరి, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.