.....
నేటి సాక్షి నారాయణపేట సెప్టెంబరు 11( రిపోర్టర్ ఇమామ్ సాబ్),
గణేష్ ఉత్సవాలు, గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ విభాగం సిబ్బందితో ఎస్పీ సమావేశమై ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లు, సిబ్బంది విధులు, అప్రమత్తత తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.
గణేష్ ఉత్సవాలు పూర్తయ్యే వరకు ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన విధుల్లో పూర్తి అప్రమత్తతతో ఉండాలని ఎస్పీ సూచించారు. విధుల పట్ల క్రమశిక్షణ, అంకితభావం, బాధ్యతాయుత వైఖరితో పనిచేయాలని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని తెలిపారు.
గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు అత్యవసర పరిస్థితులు మినహా ఎవరికీ సెలవులు ఉండవని, ప్రతి ఒక్కరూ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అత్యవసర సమయంలో సిబ్బంది అందుబాటులో ఉండటం ద్వారా బందోబస్తు విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు.
ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు సివిల్ పోలీస్ విభాగానికి వెన్నెముకలాంటి వారని ఎస్పీ పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా సివిల్ పోలీసులతో సమన్వయంతో పనిచేస్తూ బందోబస్తు విధులను విజయవంతంగా నిర్వహించేందుకు ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సూచించారు. సిబ్బంది మధ్య సమన్వయం, సమాచార మార్పిడి, టీమ్ వర్క్‌తో విధులు నిర్వహించాలని అలాగే ఉత్సవాల సమయంలో ప్రజలతో మర్యాదగా, సంయమానంతో ఉండాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది వారి విధులు, సమస్యలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి ఏవైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి నేరుగా తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. విధులు నిర్వహించే సిబ్బంది సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు తదితర అంశాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ మహేష్, విజయ్ భాస్కర్, భాగ్యలక్ష్మి రెడ్డి, శివ శంకర్, శ్వేత, శిరీష, శివయ్య, ఆర్ముడు రిజర్వ్ పోలీసులు పాల్గొన్నారు.