.👉 అమర్చిన పైపులు తొలగింప

నేటి సాక్షి చిలుకూరు

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బస్ సెంటర్ పనులకు రాజకీయ అడ్డంకులు ఎదురయ్యాయి. బస్ సెంటర్ ఏర్పాటులో భాగంగా గ్రామపంచాయతీ సిబ్బంది అమర్చిన పైపులను బిఆర్ఎస్ సీపీఐ పార్టీ నాయకులు తొలగించిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
అభివృద్ధి పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన పైపులను తొలగించే అధికారం ఎవరికి ఉందన్న ప్రశ్న ఇప్పుడు స్థానికంగా వినిపిస్తోంది. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రజా అవసరాల కోసం చేపడుతున్న పనులకు అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉండగా, ఏకపక్షంగా పైపులు తొలగించడం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అభివృద్ధి పనులపై రాజకీయ పెత్తనమా?
బస్ సెంటర్ ఏర్పాటు పూర్తయితే ప్రయాణికులకు, గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. అలాంటి ప్రజా ప్రయోజన కార్యక్రమానికి ఆటంకాలు కలగడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులను అడ్డుకోవడం కంటే, సమస్య ఏదైనా ఉంటే అధికారుల సమక్షంలో పరిష్కరించుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.
అధికారులు స్పందించాలి
పైపులు ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఎవరి అనుమతితో తొలగించారు? గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులకు ఉన్నతాధికారుల అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అభివృద్ధి పనులు రాజకీయ వివాదాలకు వేదిక కాకుండా అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.