నేటి సాక్షి గజ్వేల్ : పోషణ్ మాసం కార్యక్రమాల్లో భాగంగా ‘మన అంగన్‌వాడీ–మన బాధ్యత’ థీమ్‌తో అహ్మదీపూర్ సెక్టార్ పరిధిలోని బెజుగాం గ్రామపంచాయతీలో గురువారం సెక్టార్ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార వైవిధ్యం, ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న ఆహారం, పోషకాహారం ప్రాముఖ్యతపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ కిరణ్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రాజెక్టు పరిధిలోని ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పోషణ్ మాసం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా ఒక పూట సంపూర్ణ పోషకాహారాన్ని, అంగన్‌వాడీ ప్రీ-స్కూల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గ్రామ సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ పౌష్టికాహారంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామంలోని లబ్ధిదారులు ఈ కార్యక్రమాల ద్వారా అవగాహన పొంది అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ భవానీ గర్భిణీలు, బాలింతలకు రక్తహీనత నివారణతో పాటు ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆరోగ్య సూచనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గోపాల్ ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్‌వాడీ సేవల్లో చురుకుగా పాల్గొంటున్న వారిని ‘పోషణ్ ఛాంపియన్స్’గా అభినందించి పోషణ్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కరుణాకర్, వార్డు సభ్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అహ్మదీపూర్ సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.