పనుల కొలతలు, మస్టర్‌ రోల్స్‌, బిల్లులపై సమగ్ర విచారణ జరిపించాలి

నేటి సాక్షి చిలుకూరు:(మొక్క వెంకన్న గౌడ్)

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని రామాపురం &(కట్ట కమ్మ గూడెం ) గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై గ్రామస్తులు పలు ఆరోపణలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సుమారు 500 మీటర్ల మేర మాత్రమే పని జరిగితే, రికార్డుల్లో 1000 మీటర్లుగా నమోదు చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అలాగే ఉపాధి హామీ పనులకు హాజరుకాని కొంతమంది వ్యక్తులను పనులకు వచ్చినట్లుగా మస్టర్‌ రోల్స్‌లో నమోదు చేసి, వారి పేర్లపై బిల్లులు చెల్లించినట్లు వారు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని గ్రామస్తులు అంటున్నారు.
పనుల కొలతలు, మస్టర్‌ రోల్స్‌, కూలీల హాజరు, చెల్లింపుల వివరాలు, పనుల ఫొటోలు తదితర రికార్డులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఒకే కుటుంబానికి చెందిన కొంతమంది ఖాతాల్లో ఉపాధి హామీ డబ్బులు పెద్ద మొత్తంలో జమైనట్లు గా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా రికార్డుల్లో చూపిన పనుల పరిమాణానికి, వాస్తవంగా జరిగిన పనికి మధ్య వ్యత్యాసం ఉందా లేదా అనే అంశంపై సాంకేతికంగా కొలతలు నిర్వహించాలని కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై మండల స్థాయి అధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టి, రికార్డులను బహిరంగంగా పరిశీలించాలని రామాపురం ప్రజలు కోరుతున్నారు. ఆరోపణలు నిజమని విచారణలో తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వ నిధులు దుర్వినియోగమై ఉంటే వాటిని తిరిగి రాబట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధి హామీ పథకం నిధులు ప్రజల కోసం ఉద్దేశించినందున, పనుల అమలులో పూర్తి పారదర్శకత ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.