వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

నేటి సాక్షి, ధర్మారం: ధర్మారం మండలంలోని మల్లాపూర్, ఖిలావనపర్తి గ్రామాల్లో సోమవారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్‌ యు. సుస్మిత తెలిపారు. ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల ఆవరణలో నందిమేడారం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఈ శిబిరాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శిబిరాల్లో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స, మందులు అందించనున్నట్లు చెప్పారు. జ్వరం, జలుబు, దగ్గు తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్య శిబిరాలకు హాజరై వైద్యుల సలహాలు పొందాలని సూచించారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్య సేవలు పొందాలని పేర్కొన్నారు. రెండు గ్రామాల ప్రజలందరూ ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.