నేటి సాక్షి అక్టోబర్ 05పాములపాడు:-
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం ఎం.రఫిక్ అహమ్మద్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్ ఎన్నికలలో టేకూరి రామసుబ్బమ్మ బలపరిచిన బోనపల్లె సురేష్, శీలం లక్ష్మీదేవి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులు వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ కి శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి ఘనంగా సన్మానించారు.
ప్రజల్లో మంచి పేరు, ఆదరణ ఉన్నంతవరకు ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా విజయాన్ని అడ్డుకోలేరని మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ పేర్కొన్నారు. ప్రజలే తమ తీర్పుతో వారికి తగిన సమాధానం ఇచ్చారని ఆమె తెలిపారు. తమ మద్దతుతో అభ్యర్థులను గెలిపించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, వేంపెంట గ్రామ ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ ఎస్ఎంసి ఎన్నికలలో ఎలాంటి ఘర్షణలు, ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేందుకు సహకారం అందించిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కి, ఆత్మకూరు డీఎస్పీ ఆర్.రామాంజీ నాయక్ కి, రూరల్ సీఐ ఎం.సురేష్ కుమార్ రెడ్డి కి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులకు సింగపూర్‌లో నివసిస్తున్న వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నాగేష్ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు స్కూల్ కమిటీ సభ్యులు పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని ఆయన కోరారు. అదేవిధంగా పాఠశాలకు అవసరమైన పనులను తమ వంతుగా చేపడతామని సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు & అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.