నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- హైదరాబాద్ నగరంలో నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ అధ్యక్షతన సంఘం నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికపై చర్చించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా నేతకాని మహార్ కులాలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో కొలువైన ప్రజా ప్రభుత్వం ఉందని తెలిపారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురు కావద్దనే ఆలోచనతో ప్రక్రియను చట్టబద్ధంగా ముందుకు తీసుకు వెళుతున్నామన్నారు. నేతకాని మహార్ కులానికి అన్యాయం జరిగిందని, కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నేతకాని మహార్ కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతకాని మహర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సునార్కార్ రాంబాబు, సంఘం నాయకులు పాల్గొన్నారు.





