Monday, March 16, 2026

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత

  • పెన్షన్లు ఫిబ్రవరి ఒకటవ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయాలి
  • జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు ఫిబ్రవరి 1 వ తారీఖున పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6.00 గంటల నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ చేయాలని సచివాలయం సిబ్బందిని ఆదేశిస్తూ డిఎల్డిఓలను, ఎంపీడీవోలను, మున్సిపల్ కమిషనర్లను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ ఆదేశించారు. గురువారం ఉదయం పి.డి, డి ఆర్ డి ఏ- వెలుగు, లీడ్ బ్యాంకు మేనేజరు, ఎంపీడీవో లు, మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ తదితరులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు సూచిస్తూ ఫిబ్రవరి 1 వ తారీఖు శనివారం పంపిణీ చేయవలసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ మొత్తాన్ని 31.01.2025 శుక్రవారం సంబంధిత అధికారులు డ్రా చేసి సేఫ్ కస్టడీ లో ఉంచుకొని, ఫిబ్రవరి, 1 వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఫిబ్రవరి 1 వ తేదీన ఎన్టీఆర్ భరోసా ఫించన్లు ఏదైనా కారణం చేత తీసుకోని లబ్ధిదారులకు 03.02.2025 తేదీన వారి ఇంటి వద్దనే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన 2,63,191 మంది ఫించన్ దారులకు సుమారు 112.19 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని, శనివారం అదే రోజు 100 శాతం ఫించన్లు పంపిణీ చేయాలని, దానికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 1 వ తేదీన పెన్షన్ ఇస్తున్న విషయం ప్రతి ఫించన్ దారునికి వ్యక్తిగతంగా తెలియచేయాలని, అలాగే ఫించన్ పంపిణీకి నిర్దేశించిన సిబ్బంది ఉదయం వారి గ్రామానికి 5.30 కి చేరుకుని తప్పకుండా ఆరోజు ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్క పొరపాటు జరగకుండా ఫించన్లు పంపిణీ జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి పెన్షన్ పంపిణి చేయు అధికారి పెన్షన్ దారులతో గౌరవ ప్రదంగా వ్యవహరించాలని, అవినీతికి పాల్పడరాదని మరియు ఇంటి వద్దనే ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయవలెనని తెలియజేశారు. ఎవరైనా దీనిని అతిక్రమించినచో క్రమ శిక్షణా చర్యలు తీసుకోబడునని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అలాగే గత నెలలలో ఏదేని కారణంతో ఫించన్ తీసుకోని వారికి ఈ నెల పించన్ మొత్తంతో కలిపి పంపిణీ చేయాలని అన్నారు. ఈ సమాచారం అందరికి తెలియచేయాలని మండల పరిషత్ అభివృద్ది అధికారులను, మునిసిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఫించన్ దారులకు అందరికీ ఐ వి ఆర్ యస్ విధానం పై వ్యక్తిగతంగా తెలియచేయాలని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News