- రాష్ట్ర బడ్జెట్ పై తిరుపతి ఎం.పీ. మద్దిల గురుమూర్తి ఎద్దేవా
నేటి సాక్షి తిరుపతి న్యూస్ తిరుపతి ప్రతినిధి డాక్టర్ శివ : రాష్ట్ర బడ్జెట్ పై తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు. పిట్ట కొంచం కూత ఘనం అనిపించేలా ఉందని విమర్శించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధుల కేటాయింపు చూసినట్లయితే బారీగా లబ్దిదారుల సంఖ్యలో కోత పడుతుందనే వాస్తవాలని చెప్పకనే చెబుతుందని అన్నారు. ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక ఈ రెండు పథకాలకు నిధులు కేటాయించినట్లు కనిపిస్తుందని అన్నారు. సూపర్ సిక్స్ హామీలలో మిగిలిన పథకాలు అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 పథకాలకు మోక్షమెప్పుడో చెప్పలేని దయనీయ స్థితిలో ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందని అన్నారు. దీపం సిలిండర్లకు, పింఛన్ల పథకాలకు కూడా ఈ బడ్జెట్ లో నామ మాత్రపు నిధులు కేటాయించారని వెరసి లబ్దిదారుల కోత తప్పేలా లేదని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి, కేవలం అంకెల గారడీ చేయడం దారుణమని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వ్యాఖ్యానించారు. ప్రజలు ఈ అసమతుల్య బడ్జెట్‌ను ఖండించాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.




