Tuesday, March 24, 2026

రేపటి నుంచి పింఛన్ల పంపిణీ సజావుగా పూర్తి చేయాలి

  • మార్చి 15లోగా అభివృద్ధి పనులు వందశాతం పూర్తి కావాలి
  • జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా (భక్తకుమార్): ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 1న అన్నమయ్య జిల్లాలో 100 శాతం సామాజిక పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రగతి పనులపై తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 1న వందశాతం పింఛన్ల పంపిణీ సక్రమంగా జరగాలని, ఉదయం 6 గంటలకు స్వయంగా ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛన్ ఇవ్వాలన్నారు. పింఛనుదారులకు అవగాహన కలిగేలా ముందుగానే టామ్ టామ్ వేయాలని, 1న ఉదయం 5.30 గంటలకు సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచించారు. పింఛను పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారు నుంచి రూపాయి కూడా వసూలు చేయొద్దని పేర్కొన్నారు. ఎవరైనా లబ్ధిదారు నుంచి డబ్బులు వసూలు చేస్తే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్చి 7లోగా పనులు పూర్తి చేయాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ, ఉపాధి హామీ పథకాలలో భాగంగా ఇప్పటికే ప్రగతిలో ఉన్న రహదారులు, ఫారం పాండ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, గృహ నిర్మాణాలు మార్చి 7 లోగా పనులను పూర్తి చేయాలని మండల స్థాయి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండల వారీగా సమీక్షించి, ప్రగతిలో వెనకబడిన వారిని కారణాలు అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేపట్టిన పనులలో మార్చి 7లోగా పూర్తయిన పనులు కాకుండా మిగిలిన వాటిని మార్చి 15లోగా తప్పనిసరిగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. బాధ్యతాయుతంగా పనుల ప్రగతిలో లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రగతిని సమీక్షించుకొని లక్ష్యసాధనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం వివిధ అంశాల్లో పలు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్డీఏ, డ్వామా, హౌసింగ్ పీడీలు, పంచాయతీరాజ్ ఎస్ఈ, ఎల్డీఎం, ఎంపీడీఓలు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News