- ప్రత్యేక అధికారులు వసతి గృహాలను పర్యవేక్షించారు
- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో యాదయ్య తో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యతలు అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 53 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అక్కడ విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన అవసరాలు ఏమేమి ఉన్నాయి అనే విషయాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో ఉపాధి హామీ సిబ్బందికి పని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





