- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- రానున్న వేసవికాలంలో సాగునీటికి, త్రాగునీటికి ఎలాంటి సమస్య లేకుండా ప్రణాళికబద్ధమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో సాగునీరు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా, రైతు భరోసా, యూరియా కొరత, రేషన్ కార్డుల జారీ, రెసిడెన్షియల్ పాఠశాలల సందర్శన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, వచ్చే వేసవికాలం దృష్ట్యా ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా కార్యచరణ రూపొందించి నిరంతరం నీటి సరఫరాకు చర్యలు తీసుకోవడంతో పాటు రబీ సీజన్ కొరకు సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువులపై సమీక్షించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ సాగులో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో యూరియా కొరత లేకుండా చూడాలని తెలిపారు. వేసవికాలంలో వ్యవసాయానికి, త్రాగునీటికి, నిర్మాణ రంగానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని, అర్హత గల ప్రతి రైతుకు రైతు భరోసా అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కొరకు అందిన దరఖాస్తులలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న జిల్లాలను మినహాయించి మిగతా జిల్లాలో అర్హులైన లబ్దిదారులు రేషన్ కార్డులు అందించాలని తెలిపారు. ప్రభుత్వ, గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. దినపత్రికలు, సోషల్ మీడియాలలో వచ్చే ప్రతికూల వార్తలపై సంబంధిత అధికారుల సమన్వయంతో స్పందించి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి, త్రాగునీటికి, నిర్మాణ రంగానికి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతు భరోసా పథకం క్రింద అర్హులైన అందరికీ పథకం అందించే విధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు చేపడుతున్నామని, రేషన్ కార్డుల కొరకు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాస్ రావు, హరికృష్ణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





