- హర్షం వ్యక్తం చేసిన బీసీ సంక్షేమ సంఘం
- రాష్ట్ర కార్యదర్శి బొనగం రాజేశం గౌడ్
నేటి సాక్షి, బెజ్జంకి : రాష్ట్ర రాజకీయ పార్టీల్లో బీసీలకు ప్రాధాన్యత పెరుగుతుండడం శుభసూచకమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొనగం రాజేశం గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. జనాభాలో 65% ఉన్న బీసీలకు కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ పార్టీలు ముగ్గురు బీసీ అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో నిలపడం గమనార్హమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గం చూపించిన చైతన్యానికి ఇది అద్దం పడుతోందని, భవిష్యత్తులో కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థలలో కూడా బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించిన పార్టీలు తమ మద్దతును పొందగలవని స్పష్టం చేశారు. ఇది బీసీల విజయమని,రాజకీయంగా బలపడేందుకు బీసీలు ఐక్యంగా ఉండాలి. భవిష్యత్ ఎన్నికల్లో మన సామాజిక వర్గం ప్రాధాన్యత పెరిగేలా నిరంతరం కృషి చేయాలని బొనగం రాజేశం గౌడ్ వ్యాఖ్యానించారు.



