- తహసీల్దార్ కు జర్నలిస్టుల వినతి పత్రం
నేటి సాక్షి, చెన్నూరు : పదకొండేళ్ల క్రితం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదించిన ప్రభుత్వ స్థలాన్ని బుధవారం రోజున పట్టణానికి చెందిన పలువురు నేతలు ఆక్రమించే ప్రయత్నం చేయగా వారిని అడ్డుకొని, అట్టి స్థలానికి రక్షణ కల్పించాలని చెన్నూరు ప్రెస్ క్లబ్ సభ్యులు గురువారం రోజున చెన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మల్లిఖార్జున్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం చెన్నూరు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కనుకుంట్ల వెంకట్రాజ్ మాట్లాడుతూ, పదకొండేళ్ల క్రితం అప్పటి అధికారులు జర్నలిస్టుల సంక్షేమార్థం వారి ఇళ్ల స్థలాల నిర్మాణానికి చెన్నూరు శివారులోని సర్వే నెం 863లో గల 2ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రతిపాదించగా, నాటి నుండి నేటి వరకు తాము అట్టి స్థలానికి రక్షణ కల్పిస్తూ వస్తున్నామని, కానీ కొద్ది రోజులుగా పట్టణానికి చెందిన పలువురు కీలక నేతలు అట్టి స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, అందులో భాగంగా బుధవారం రోజున అట్టి స్థలాన్ని చదును చేసే ప్రయత్నం చేయగా వారిని అడ్డుకున్నామని అన్నారు.వారు చేస్తున్న ఆగడాలపై స్థానిక తహసీల్దార్ కు పలుమార్లు పిర్యాదు చేసినా వారు స్పందించడం లేదని, ఇప్పటికైనా అట్టి స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ హెచ్చరికా బోర్డు ఏర్పాటు చేసి కబ్జాకు ప్రయత్నం చేస్తున్న అక్రమార్కులపై తగు చర్యలు తీసుకొని జర్నలిస్టుల ఇంటి స్థలాలకు ప్రతిపాదించిన స్థలానికి రక్షణ కల్పించాలని వెంకట్రాజ్ కోరారు.

