- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిచాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో గల మాతా, శిశు ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళ, శిశువుల సంక్షేమంలో భాగంగా ప్రత్యేకంగా మాతా, శిశు ఆసుపత్రిని ఏర్పాటు చేసి సేవలు అందించడం జరుగుతుందని, ఈ క్రమంలో ఆసుపత్రికి వచ్చే వారితో మర్యాదగా వ్యవహరిస్తూ వారికి అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. గర్భిణుల వివరాలు నమోదు చేసుకొని సమయానుసానంగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందించడంతో పాటు గర్భస్థ సమయంలో తీసుకోవలసిన పౌష్టిక ఆహారం, పాటించవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని తెలిపారు. పిల్లల సంక్షేమంలో భాగంగా టీకాలు, మందులు సకాలంలో అందించాలని సూచించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలపై ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. అనంతరం కాలేజ్ రోడ్డులో నిర్మిస్తున్న మహా ప్రస్థానం (వైకుంఠధామం) ను సందర్శించి కొనసాగుతున్న పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎంఓలు, భీష్మ, శ్రీధర్, వైద్యాధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





