నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
గత సంవత్సరం నుండి అర్ధాంతరంగా ఆగిపోయిన జిల్లా కేంద్రంలోని రాముని చెరువు కట్ట అభివృద్ధి, సుందరీకరణ పనులు వెంటనే చేపట్టి, పూర్తిచేసే విధంగా పనులు దక్కించుకున్న గుత్తేదారకు ఆదేశాలు ఇవ్వాలని రాముని చెరువు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, సింగరేణి విశ్రాంతి కార్మిక సంఘం, సీనియర్ సిటిజన్స్ సంఘం నాయకుడు గజెల్లి వెంకటయ్య ఆదివారం ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టియుఎఫ్ఐడిసి 3.5 కోట్ల రూపాయల నిధులతో ఏప్రిల్ 25, 2022న ప్రారంభించిన రాముని చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులు గత మూడు సంవత్సరాలు గడుస్తున్నా పనులు ఎందుకు పూర్తి కావడం లేవని ప్రశ్నించారు. అభివృద్ధి పనులు పూర్తి కావడానికి బాధ్యులు ఎవరో పట్టణ ప్రజానీకానికి, వాకర్స్ సభ్యులకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాముని చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులు చేయడంలో గత మూడు సంవత్సరాల నుండి నిర్లక్ష్యం వహిస్తూ పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అభివృద్ధి పనులను పూర్తిచేసే విధంగా వెంటనే తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో వాకర్స్ అసోసియేషన్, సింగరేణి విశ్రాంతి కార్మిక సంఘం, సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శాంతియుతంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.





