నేటి సాక్షి ప్రతినిధి, గద్వాల్ (మానోవపాడు):
జోగులాంబ గద్వాల జిల్లాలోని సాగునీటిని అందించే ఆర్డీఎస్ కాలువ నీల్లు అధికమై కొంతమంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు పూర్తిగా మునిగేలా ఆర్డీఎస్ నీళ్లు రోడ్లపై భారీగా ప్రవహిస్తున్నాయి. దీంతో రైతులు, గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. మానవపాడు మండల పరిధిలోని నారాయణపురం శివారులో డీ 30 ఆర్డీఎస్ కాల్వ సైఫన్ పై భాగం నుంచి సాగునీళ్లు ప్రవహిస్తూ గ్రామంలోకి వస్తున్నాయి. దీంతో రహదారులు కాల్వలను తలపిస్తున్నాయి. రైతు కళ్లాలోకి నీళ్లు రావడంతో గడ్డివాములు తడిసిపోతున్నాయి. రోడ్ల వెంట నడవాలన్నా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నోసార్లు అధికారులకు సమస్య వివరించినా, పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఎస్ కాలువలో పేరుకుపోయిన షీల్ట్ తొలగించకుండా కాల్వకు నీళ్లు వదలడం మూలంగా సాగునీరు అధికమై కాలువపై భాగం నుండి ఒలికిపడుతున్నాయి. దీంతో గ్రామంలోకి కాలువ నీళ్లు ప్రవహిస్తున్నాయి. రైతు కళ్లాలోని వరిగడ్డి, పశుగ్రాసం తడిసిపోవడంతో రైతులకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. కాలువ నీళ్లు రోడ్లపై ప్రతిరోజు ప్రవహిస్తుండడంతో రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని, చాలామంది రైతులు నీళ్లలో వెళ్లలేక జారిపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఆర్డీఎస్ అధికారులు, మండల అధికారులు స్పందించి కాలువను పరిశీలించాలని, నీళ్లు గ్రామంలోకి ఎలా వస్తున్నాయో నేరుగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు సూచిస్తున్నారు. గత నెల రోజులుగా ఈ పరిస్థితి ఉందని గ్రామస్తులు అంటున్నారు.

