- జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా
నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిసిపి రవీందర్ తో కలసి అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయా శాఖల వారీగా అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో వేడుకలు నిర్వహించ నున్నందున అందుకనుగుణంగా వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రొటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేలా వైద్య బృందాన్ని, అగ్నిమాపక యంత్రాన్ని వేడుక స్థలం వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. వరంగల్ ఆర్డీఓ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. ఈ నెల 25 లోగా ప్రశంసా పత్రాలు సిద్ధం చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ.. వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డిఓలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.





