నేటి సాక్షి, గోదావరిఖని(రమేష్) : సింగరేణి లో 2021 జూలై 1 నుంచి పదవి విరమణ చేసిన ఉద్యోగుల యొక్క సవరించిన పెన్షన్ ను వెంటనే చెల్లించాలని, అదేవిధంగా పెన్షన్ ఏరియర్స్ బకాయిలు కూడా చెల్లించాలని, జనవరి నుంచి నిలిపి వేసిన పెన్షన్లు వెంటనే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి గుర్తింపు సంఘం) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. గోదావరిఖని సి.ఎం.పి.ఎఫ్ కార్యాలయంలో కమీషనర్ పచౌరి తో మాట్లాడి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు ఈ నెలలో బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సిన రెగ్యులర్ పెన్షన్ ను జీవన్ ప్రమాణ్ పత్రాలు ఆన్ లైన్ లో ఇచ్చినప్పటికిని ఎందుకు జమ చేయలేదని కమీషనర్ ను ప్రశ్నించారు. పెన్షన్లు జమ చేయక పోవడం వల్ల చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు, వెంటనే నిలిపి వేసిన రెగ్యులర్ పెన్షన్లు రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని, అదే విధంగా పదకొండవ వేజ్ బోర్డు లో దాదాపు వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల సవరణ పెన్షన్ ను వెంటనే చెల్లించాలని, పెరిగిన సవరణ పెన్షన్ ఏరియర్స్ కూడా చెల్లించాలని కమీషనర్ ను డిమాండ్ చేశారు, రిటైర్డ్ ఉద్యోగులకు రివైజ్డ్ పెన్షన్ ఫేమేంట్ ఆర్డర్ కాఫీలు రాక చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారని, భర్త చనిపోతే భార్యకు వితంతు పెన్షన్ పొందేందుకు రివైజ్డ్ పి.పి.ఓ కాఫీ లేక పోవడం వల్ల వితంతు పెన్షన్ దారులు ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే రివైజ్డ్ పెన్షన్ ఫేమేంట్ ఆర్డర్ కాఫీలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం దన్ బాద్ లోని సి.ఎం.పి.ఎఫ్ కమీషనర్ కు లేఖను పంపుతామని, ఫిబ్రవరిలో రిటైర్డ్ ఉద్యోగుల పదకొండవ వేజ్ బోర్డు పెన్షన్ బకాయిలు చెల్లించాలని లేకుంటే ఏఐటియుసి ఆధ్వర్యంలో సి.ఎం.పి.ఎఫ్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇంకా కార్యక్రమంలో ఏఐటియుసి శ్రీరాంపూర్ బ్రాంచి కార్యదర్శి బాజీసైదా తో పాటు తదితరులు పాల్గొన్నారు.





