నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్:ఆసిఫాబాద్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో పోగొట్టుకున్న రూ.50 వేల నగదును పోలీసుల సకాలంలో తీసుకున్న చర్యలతో గుర్తించి బాధితుడికి అందజేసినట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు.వివరాల్లోకి వెళితే, శనివారం ఆసిఫాబాద్ మండలం అప్పపల్లి గ్రామానికి చెందిన బాపురాం SBI బ్యాంకులో రూ.2 లక్షల నగదును విత్డ్రా చేశారు. అనంతరం బ్యాంకులోనే కూర్చొని నగదును లెక్కపెట్టే క్రమంలో రూ.50 వేలును పక్కన పెట్టి మర్చిపోయారు. ఇంటికి వెళ్లిన తర్వాత నగదును పరిశీలించగా రూ.50 వేలు తక్కువగా ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు బ్యాంకులోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి, అక్కడ మర్చిపోయిన నగదును తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తించారు. అతడిని సంప్రదించి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకుని, పూర్తి విచారణ అనంతరం బాధితుడు బాపురాంకు సీఐ బాలాజీ వరప్రసాద్ చేతుల మీదుగా నగదును అందజేశారు.పోలీసుల వేగవంతమైన దర్యాప్తు, బాధ్యతాయుతమైన చర్యలతో బాధితుడికి న్యాయం చేయడంపై జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆసిఫాబాద్ పోలీసులను అభినందించారు.

