నేటి సాక్షి, కరీంనగర్: భారతదేశంలాంటి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు చాలా కీలకంగా వ్యవహరిస్తాయని, ఎన్నికల ద్వారానే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలుపర్చగలుతామని మరియు ప్రజలకు కావల్సిన అభివృద్ధి ఫలాలను చాలా సులభంగా అందజేయవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి అన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్ ప్రాంగణంలో గురువారం పాఠశాల హౌస్ ఎన్నికల నియమవళిని పాటిస్తూ ఏర్పాటు చేసిన ‘హౌస్ ఎలక్షన్స్’ ప్రక్రియను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఎన్నికల వాతావరణం తలపించేలా పాఠశాలలో పోలింగ్ స్టేషన్, పోలింగ్ కేంద్రం, పోలింగ్ ఆఫీసర్, ఓటింగ్ యంత్రం, రిటర్నింగ్ అధికారి, తదితర అంశాలను తెలియపర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికలు, ఓట్లు ప్రజాస్వామ్య దేశంలో కీలకంగా వ్యవహరిస్తాయని, ప్రజల మనోభావాలకు దర్పణం అని చెప్పారు. విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచె ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంచేందుకు ఏటా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ యేడాది కూడా రెట్టింపు ఉత్సాహంతో పాఠశాలలోని వివిధ విభాగాల కెప్టెన్స్, వైస్ కెప్టెన్లకు ఎన్నికల వాతావరణం కల్పించేలా ఎన్నికలు నిర్వహించారని పేర్కొన్నారు. పాఠశాలలోని ‘తేజస్’, ‘సరస్’, ‘ధృవ’, ‘లక్ష్య’ విభాగాలకు విద్యార్థులకు వేర్వేరుగా ఎన్నికలు పెట్టినట్టు చెప్పారు. విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపడంతో పాటు వారి శక్తి సామర్థ్యాలను పెంచేందుకు, ప్రత్యేకంగా సామాజిక స్పృహను కల్పించడానికి ఎన్నికలను అట్టహాసంగా నిర్వహించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది ఔత్సాహికులు వారి ఉత్సాహాన్ని ప్రదర్శించి పోటీలో పాల్గొని, కేటాయించిన గుర్తులను ప్రచారం చేసుకొని ఓట్లను అభ్యర్థించారు. విద్యార్థులు ప్రదర్శించిన ‘ఓటు విలువైన హక్కు’, ‘ఓటు వేయకపోతే కోల్పోతాం మన హక్కు’ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఓట్ల లెక్కింపు అనంతరం గెలుపొందిన వారికి ప్రమాణం చేయిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.