- హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఎలాంటి అవాంతరాలు లేకుండా స్త్రీ, పురుష సమానత్వం తోనే సమాజం పురోగతిని సాధిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ సుబేదారి లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో కళాశాల మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో యాక్సిలరేట్ యాక్షన్ అనే అంశం పై సమావేశాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ గతంలో బాల బాలికల నిష్పత్తితో పాటు విద్యలోనూ వ్యత్యాసం ఉండేదని, కానీ అది నేడు తగ్గిపోతూ వస్తుందన్నారు. సమాజంలో వివిధ అవకాశాలను పొందేందుకు మహిళలకు సమాన హక్కులు రాజ్యాంగంలో కల్పించ బడ్డాయన్నారు. మహిళలకు ఉన్నత విద్యను అభ్యసించే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాలికలు విద్యా, ఉద్యోగ, ఇతర రంగాలలో సమాన అవకాశాలను సాధించాలన్నారు. స్త్రీ, పురుష సమానత్వం సాధించినప్పుడే సమాజం పురోగమిస్తుందన్నారు. మహిళా సాధికారతను సాధించాలని ఆకాంక్షించారు. విద్యా, ఉద్యోగం, ఇలా ఏ రంగంలో నైనా మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. విభిన్న రంగాలలో మహిళలు రాణిస్తున్నారని, ఎంచుకున్న లక్ష్యం కోసం కష్ట పడాలన్నారు. ఎంచుకున్న లక్ష్యం కోసం కష్టపడి సాధించి నిరూపించుకోవాలన్నారు. స్త్రీ పురుషులు సమానం అనే భావన సమాజంలో నెలకోనాలన్నారు. ఈ సందర్భంగా ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. గౌరవ అతిథిగా హాజరైన కాకతీయ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం మాట్లాడుతూ భిన్న రంగాలలో మహిళలు రాణిస్తూ తమ ప్రతిభను చాటు తున్నారని అన్నారు. సమాజంలో మహిళలు అనేక విధాలుగా హింసలను, అవమానాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నేటి అభివృద్ధి చెందిన సమాజంలోనూ అలాంటి పరిస్థితులు పోయి మహిళలకు సమున్నత స్థానం కల్పించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమాజం లోని బాలికలను, మహిళలను గౌరవించే విధంగా పెంచాలన్నారు. ఎలాంటి అంతరాలు లేకుండా బాల బాలికలను తల్లి దండ్రులు సమానంగా పెంచాలని అన్నారు. నేడు సమాజంలో బాలికలు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, విదేశాల్లోనూ విద్య, ఉద్యోగ రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. విభిన్న రంగాలలో మహిళల మరింతగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ సమాజం లోని మహిళలను గౌరవించాలని అన్నారు. విభిన్న రంగాలలో మహిళలు రాణించినప్పుడే సమాజం ఎదుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ సమాజంలో బాల బాలికలకు సమాన గౌరవం ఉండాలన్నారు. జీవితం కోసం ఒక ప్రణాళికతో లక్ష్యం కోసం బాలికలు బాగా చదవాలన్నారు. బాలికలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. సమయాన్ని వృధా చేయకుండా భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్ డాక్టర్ కె. అనితా రెడ్డి మాట్లాడుతూ విభిన్న రంగాల్లో మహిళలు సాధికారతను సాధిస్తున్నారని అన్నారు. ఎంచుకున్న ఏ రంగంలోనైనా ముందుకెళ్లాలన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని మహిళలు సాధించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, తదితరులను మహిళా అధ్యాపకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఉమెన్స్ సెల్ డైరెక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీలత, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శ్రీధర్ కుమార్ లోథ్, తిరునహరి శేషు, మహిళా అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




