- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో డిసిపి ఎ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ లతో కలిసి ఎసిపిలు, తహశిల్దార్లు, సిఐలు, ఎస్ఐలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన తరువాత ఈ నెల 10వ తేదీ నుండి ప్రారంభమయ్యే ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి తహశిల్దార్, ఎస్ హెచ్ ఓ, మండల పంచాయతీ అధికారి, మున్సిపల్ పరిధిలో తహశిల్దార్, ఎస్.హెచ్.ఓ., మున్సిపల్ కమీషనర్ హాజరై అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి కనీసం 15 రోజులు, గరిష్టంగా 21 రోజులలోగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండల పరిధిలో పరిష్కారమయ్యే భూ సమస్యలను రికార్డులను సరి చూడాలని, దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి పరిష్కరించాలని తెలిపారు. డివిజన్ స్థాయిలో రాజస్వ మండల అధికారి, ఎసిపిలు, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, డిసిపిలు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి అప్పటికప్పుడు పరిష్కారమయ్యే వాటిని పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించి ఆయా స్థాయిలలో రిజిస్టర్ ఖచ్చితంగా నిర్వహించాలని, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, తమ పరిధిలో లేని సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పైస్థాయికి సిఫారసు చేయాలని తెలిపారు. కోర్టులో పరిష్కారమయ్యే సమస్యలపై సంబంధిత అర్జీదారులకు అవగాహన కల్పించాలని, బెదిరింపులు, ఆందోళన చర్యలకు పాల్పడినట్లయితే సంబంధిత వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారం కొరకు అవసరమైన సమాచారాన్ని ఆయా స్థాయిల పరిధిలోని వివిధ శాఖల నుండి పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఆక్రమిత ప్రభుత్వ భూములను చేపట్టిన నిర్మాణాలను తొలగించి స్వాధీనపర్చుకోవాలని తెలిపారు. భూములకు సంబంధించి తప్పుడు, నకిలీ ధృవపత్రాలకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులకు రిపోర్టు చేయాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి ఎసిపిలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, రవికుమార్, మండలాల తహశిల్దార్లు, సిఐలు, ఎస్ఐలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.



