Sunday, March 29, 2026

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక చర్యలు

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాస్ రావు, హరికృష్ణ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. లక్షెట్టిపేట మండల కేంద్రానికి చెందిన అంబటి పద్మ తన భర్త పక్షవాతంతో బాధపడుతున్నాడని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తాను గతంలో మహిళా సంఘాల రాష్ట్ర స్థాయి శిక్షకురాలిగా, రైతు సంఘాల శిక్షకురాలిగా, ఎన్నికల సర్వేలో సైతం పని చేశానని, తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన బార్ల కాంతమ్మ తాను ధరణి పోర్టల్లో చేసుకున్న దరఖాస్తును పరిష్కరించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. భీమిని మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన పోతురాజుల పోచయ్య తనకు అక్కలపల్లి గ్రామ శివారులో పట్టా భూమి ఉందని, ధరణి వచ్చిన తరువాత లావుని పట్టాగా చూపుతుందని, సవరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన లింగం రేవతి తాను అంగన్వాడీ టీచర్ గా పని చేసి పదవీ విరమణ పొందానని, ఈ క్రమంలో తనకు రావలసిన రిటైర్మెంట్ బెన్ఫిట్స్, ఆసరా ఫించన్ ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జన్నారం మండల కేంద్రానికి చెందిన సంబారి అంజయ్య తనకు గల పట్టా భూమి నిషేధిత జాబితాలో చూపుతుందని, తొలగించి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి మండలం బూదకుర్ద్ గ్రామానికి చెందిన బియ్యాల నిరోష తమ కుటుంబం గత 40 సంవత్సరాలుగా గ్రామ శివారులోని భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, ఇట్టి భూమికి తమకు అసైన్మెంట్ పట్టా మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News