- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ జాతీయ రహదారి 163జి నిర్మాణంలో భూములు కోల్పోయిన అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయంలో జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన బాధితుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, జాతీయ రహదారి 163జి నిర్మాణంలో భూములు కోల్పోయిన వారి జాబితా ప్రకారం బాధితులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందని, ఆర్బిట్రేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మొదటి జాబితాలో పరిహారం అందని అర్హత గల వారు సంబంధిత పత్రాలు, బ్యాంక్ పాస్ పుస్తకాలతో సంప్రదించినట్లయితే రికార్డులు పరిశీలించి, సరిగ్గా ఉన్నట్లు నిర్ధారణ జరిగితే సంబంధిత లబ్దిదారుల నుండి అక్విటెన్సీ తీసుకొని, నిర్దేశిత ధరల ప్రకారం పరిహారం చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.





