Wednesday, March 11, 2026

కోడిపందాలు, పేకాట మరియు ఇతర జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

  • చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్

నేటి సాక్షి, ప్రతినిధి, ఉమ్మడి చిత్తూరు జిల్లా : సంక్రాంతి పండగను పురస్కరించుకొని జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివార్లు మరియు ఇతర ప్రాంతాల్లో కోడి పందాలు, పేకాట వంటి జూదాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని, ఎవరైనా ఈ క్రియాకలాపాలకు పాల్పడినా, ప్రోత్సహించినా లేదా సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు తోడ్పడినా, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్ స్పష్టం చేశారు. సంక్రాంతి పండగ సాంప్రదాయాలకు ప్రతీక. దాన్ని కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో, సాంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ జరుపుకోవాలి. కానీ కోడి పందేలు, జూదాలు వంటి కార్యక్రమాలు మన సంస్కృతి, సమాజాన్ని దెబ్బతీయడం మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాల జీవితాలను నాశనం చేస్తాయి. మన యువత ఈ అసాంఘిక చర్యలకు దూరంగా ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా కోడి పందేలు నిర్వహించినా, పందేల నిర్వహణకు స్థలాలు లేదా భూములు ఇచ్చినా, జూద క్రీడలు నిర్వహించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.జూదాలు యువతను ఒడిదుడుకులకు గురిచేస్తాయి. కొందరు యువకులు జూదాలకు బానిసలై కోర్టు కేసుల్లో ఇరుక్కొని తమ భవిష్యత్తును దెబ్బతింటున్నారు. ఉద్యోగాల కోసం, పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసే సమయంలో కేసులు అడ్డంకిగా మారతాయి. అలాంటి పరిస్థితుల్లో యువత జీవితాలు అధోగతికి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు. ఇటువంటి అసాంఘిక చర్యలను పూర్తిగా నివారించేందుకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా గట్టి చర్యలు చేపడుతున్నారని, ఎక్కడైనా కోడి పందేలు, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా డయల్ 112 కు సమాచారం ఇవ్వవచ్చని, లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9440900005 కు సమాచారాన్ని పంపించవచ్చని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. మీ సహకారం మాత్రమే శాంతియుతమైన సమాజ నిర్మాణానికి పునాదని ఎస్పీ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News