నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు ధర్మంలో భాగంగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో వై అశోక్ కుమార్ కు టిజేఎస్ మద్దతు ఉంటుందని టీజేఎస్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి బి బాబన్న తెలిపారు. టిజెఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్, కుల గణన చేపట్టిందని, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి అవకాశాలు పెంచిందని తెలిపారు. స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ముఖ్యమైన నిర్ణయమన్నారు. ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులకు పట్టభద్రులు, ఉపాధ్యాయులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పదేళ్ల పాలనలో మౌనంగా ఉన్న బిఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడుతున్నారని, రాజ్యాంగంపై అవగాహన లేకుండా బిజెపి వ్యాఖ్యలు చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిజేఎస్ జిల్లా అధ్యక్షుడు రాంచందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీనివాస్, విద్యార్థి యువజన సమితి జిల్లా అధ్యక్షులు బచ్చలి ప్రవీణ్ కుమార్, సిరాజ్, పట్టణ అధ్యక్షులు ప్రదీప్, సోషల్ మీడియా నాయకులు పాముల వెంకట సాయి, జైపాల్ సింగ్, రాజు లు పాల్గొన్నారు.





