- జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఎమ్మెల్సీ పోలింగ్ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. పీఓలు, ఏపీఓ, ల శిక్షణ తరగతుల్లో కలెక్టర్. వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి ఈ నెల 27న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలసి వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు నియమించ బడిన పిఓ, ఏపిఓ, సూక్ష్మ పరిశీలకుల రెండవ శిక్షణ కార్యక్రమానికి హాజరై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పీఓలు, ఏపీఓ లను ఉద్దేశించి కలెక్టర్ కీలక సూచనలు చేశారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకళింపు చేసుకుని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన ఏర్పర్చుకోవాలని అన్నారు. ఇదివరకు నిర్వహించిన ఎన్నికల విధులే కదా అని శిక్షణ తరగతులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గ దర్శకాలు, నిబంధనలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకోవాలని సూచించారు. ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే, శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందన్నారు. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో ఓటింగ్ నిర్వహణకు ఒకింత ఎక్కువ వ్యవధి పట్టే అవకాశాలు ఉన్నందున ఓపిగ్గా, సంయమనం తో వ్యవరిస్తూ సమర్ధ వంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. 27వ తేదీన ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందని, గడువు లోపు పోలింగ్ కేంద్రం పరిధిలో క్యూ లైన్ లో ఉన్న వారికి వరుస క్రమంలో టోకెన్ నెంబర్లు అందించి వారిచే ఓటింగ్ జరిపించాలన్నారు. పోలింగ్ కు ఒక రోజు ముందుగానే ఈ నెల 26వ తేదీన ఉదయం ప్రిసైడింగ్ అధికారులు తమ బృందంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. పంపిణీ కేంద్రాల వద్ద అందించే పోలింగ్ సామాగ్రి, బ్యాలెట్ బాక్సులను క్షుణ్ణంగా పరిశీలించు కోవాలని, చెక్ లిస్ట్ లో పొందు పర్చబడిన దానికి అనుగుణంగా మెటీరియల్ అంతా కేటాయించబడినదా లేదా అన్నది జాగ్రత్తగా సరి చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ సామాగ్రిని పరిశీలించుకున్న మీదట తమ బృందంతో కలిసి అధికార యంత్రాంగం సమకూర్చిన వాహనంలోనే నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గ దర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ ఎంతో బాధ్యతా యుతంగా, జాగ్రత్తగా పోలింగ్ ప్రక్రియను జరిపించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చిన్న తప్పిదానికి కూడా తావు లేకుండా పూర్తి పారదర్శకంగా, స్వేచ్చాయుత వాతావరణంలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. నిర్లక్ష్యానికి తావిస్తూ, తప్పిదాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల లోనికి సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే పోలింగ్ విధుల గురించి పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ రోజు బ్యాలెట్ బాక్సులు తీసుకొని, పోలింగ్ ప్రక్రియ ముగిసిన మీదట వాటిని నల్గొండ లోని రిసెప్షన్ సెంటర్ లో అప్పగించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను పీ.ఓలు తమ పర్య వేక్షణలో తమ వెంటే ఉంచాలని జాగ్రత్తలు సూచించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమావళి ప్రకారంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కాగా విధులు నిర్వహించాలన్నారు. ఓటర్లు, అభ్యర్థుల ఏజెంట్లు వివిధ అంశాలపై సందేహాలను లేవనెత్తే అవకాశాలు ఉన్నందున వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పి.ఓలదే అని అన్నారు. పోలింగ్ పూర్తయిన అనంతరం పక్కాగా రికార్డు బుక్కులలో వివరాలను పొందు పరుస్తూ నివేదిక తయారు చేయాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా పోలింగ్ డే సందర్భంగా పి.ఓ లు, ఏ.పీ.ఓలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి మాస్టర్ ట్రైనర్ శ్రీనివాస్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ విజయలక్ష్మి,, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, ట్రైనింగ్ నోడల్ అధికారి బాలకృష్ణ, సూపరిండెంట్ రంజిత్, ఎన్నికల శిక్షకులు, పిఓలు ఓపీవోలు తదితరులు పాల్గొన్నారు.





