Friday, March 27, 2026

కాంగ్రెస్ పాలనలో రైతన్నకు కన్నీళ్లు

  • రైతన్న ఆగమైతుంటే.. పట్టించుకోవలసిన ప్రభుత్వం పత్తా లేదు
  • కర్షక ద్రోహి కాంగ్రెస్ ప్రభుత్వం
  • కాంగ్రెస్ గ్యారెంటీల గారడీ 6 అబద్ధాలు.. 66 మోసాలు
  • మార్పు అంటే ఇదేనా.?
  • అభయహస్తం కాదు – రైతన్నల పై భస్మాసుర హస్తం
  • పంటలు ఎండిపోతున్న పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
  • మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతున్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించే వారికి కనీస సోయి లేకుండా పోయిందని కోదాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. ప్రభుత్వమే మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘటన.చరిత్రలో ఏనాడు లేదని, మాట ఇచ్చి రైతన్నల నడ్డి విరిచిన అపకీర్తి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఆయన ఆరోపించారు. బుధవారం మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా బొల్లం‌ మల్లయ్య యాదవ్ మీడియాతో మాట్లాడుతూ. ప్రభుత్వం రైతులకు ఎస్సారెస్పీ ఫేస్ 2 ద్వారా నీళ్లు ఇస్తామంటే నే పంటలు వేశారని, హామీ ఇచ్చి పంటలకు నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నమ్మి ఒక్కో రైతు రూ. 25 నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి ఆగమయ్యారని అన్నారు. ప్రభుత్వం అవగాహన రాహిత్యం వలన రైతులు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. మా ప్రభుత్వం హయాంలో మొన్నటి వరకు జాలువారిన పంట పొలాలు నేడు ఎండి పోవటం కారణం నూటికి నూరు శాతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు.
పోరాడి సాధించిన తెలంగాణ లో కేసీఆర్ రైతాంగాన్ని సస్యశ్యామలం చేస్తే 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందని విమర్శించారు. కాళేశ్వరం నీళ్లు ఎత్తి పోయడానికి మూడు పిల్లర్స్ కుంగుబాటుకు సంబంధం లేనప్పటికీ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదన్నారు. రైతు బంధు రాలేదని ప్రశ్నించిన రైతులను నిర్బంధించటం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. మా ప్రభుత్వ హయాంలో రైతు తప్పిదం వలన ఒక్క మడి ఎండిపోతే నే నానా హంగామా చేసిన డిప్యూటీ సీఎం బట్టి‌ విక్రమార్క ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి పంట పొలాలు ఎండి పోతున్నప్పటికీ మంత్రులు కనీసం సమీక్ష చేయకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న మొసలి కన్నీళ్ళ కు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా పంట నష్టం పై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు పంట నష్టం ప్రకటించాలని, భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట తోగరు రమేష్ ,సుంకర అజయ్ కుమార్, కందిబండ సత్యనారాయణ, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News