నేటి సాక్షి, కరీంనగర్ : పెండింగ్ బిల్లలు కోసం కరీంనగర్ ప్రజావాణిలో తాజా మాజీ సర్పంచులు, ఓ రైతు చేసిన ఆత్మహత్యాయత్నం చర్యలు కలెక్టరేట్లో కలకలం రేపాయి. ఉన్నతాధికారుల్లో భయాందోళనలు కలించాయి. వివరాల్లోకి వెళితే.. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటరియంలో ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి వినతులు స్వీకరిస్తుండగా, రామడుగు, గంగాధర మండలాలకు చెందిన సుమారు 20 మంది తాజా మాజీ సర్పంచులు వినతులు పట్టుకొని వచ్చారు. ఏడాది కాలంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి లక్షలాది నిధులు రాక ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. కలెక్టర్ వారు ఇచ్చిన వినతులను పరిశీలిస్తుండగానే, గంగాధర, రామడుగు మండలాలకు చెందిన మాజీ సర్పంచులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.60 లక్షలకు పైగా రావాల్సిన నిధులు అధికారులు ఇవ్వడం లేదని ఆరోపించారు.
గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన అనుమాండ్ల తిరుపతి, మరో సర్పంచ్ భర్త జగన్మోహన్ గౌడ్ ఒక్కసారిగా కలెక్టర్‌తో ఉద్రేకంగా మాట్లాడారు. ‘నిధులు ఎప్పుడు ఇస్తారు’ అంటూ నిలదీశారు. గతేడాది ఏప్రిల్ వరకు రూ.60 లక్షలకు పైగా నిధులు రావాల్సి ఉండగా, కొంత సొమ్ము ముట్టిందని, ఇంకా 25 నుంచి 40 లక్షల వరకూ రావాలని చెప్పారు. ఏడాదిన్నరగా అధికారులను బతిమిలాడుతూనే ఉన్నామని, కాళ్లు కూడా మొక్కినా తమకు రావాల్సిన నిధులు ఇవ్వడంలేదని వాపోయారు. అప్పు తెచ్చిన డబ్బులకు వడ్డీ పెరిగిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చావే శరణ్యం అంటూ ఒక్క క్షణంలో ఇద్దరిలో ఒకరు తన జేబులోని చేతి రుమాలు తీసి, గొంతుకు గట్టిగా బిగించుకున్నాడు. దీతో అధికారులు బిత్తరపోగా, అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, ఇతర సర్పంచులు తేరుకొని, సదరు వ్యక్తిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా తమ నిధులు, సమస్యలు ఎప్పుడు తీరుస్తారంటూ గొడవ చేస్తుండగా, సెక్యూరిటీ సిబ్బంది వారిని ఆడిటోరియం బయటికి తీసుకెళ్లారు.
అదే సమయంలో రామడుగు మండలంలోని సర్వారెడ్డిపల్లికి చెందిన రాజమల్లు అనే రైతు తన భార్యతో కలిసి వచ్చి, తనకు చెందిన ఎకరం పంట భూమి అన్ని పత్రాలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ధరణిలో ఎక్కించడం లేదని కలెక్టర్‌తో గట్టిగా అరుస్తూ తెలిపాడు. ఏడాది గడుస్తున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదని ఎక్కరువు పెట్టాడు. అమాంతంగా తనతో తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా మూత తీసి తాగాలని చూశాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డబ్బా లాక్కొని సర్పంచ్, రైతులను ఆడిటరియం అవతలికి బలవంతంగా లాక్కెళ్లారు. అధికారుల ద్వారా సమాచారం అందడంతో వన్ టౌన్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులను సముదాయించారు. తమ గోడును మాజీ సర్పంచులు, రైతు విలేకరులకు తెలిపారు. చివరికి బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని, పెండింగ్ నిధుల గురించి ప్రభుత్వానికి విన్నవించి, నిధులు వచ్చేలా చూస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమనిగింది. ఈ పరిణామాలతో ప్రజావాణి వేదిక వద్ద కొద్దీ సేపు ఆందోళన, గందరగోళం నెలకొంది.