- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలో మార్చి 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, డిసిపి ఎ భాస్కర్, మంచిర్యాల, జైపూర్ ఎసిపిలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మార్చి 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోసిట్ పరీక్ష ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.50 గంటల వరకు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి 11 గంటల వరకు మినహా మిగతా పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 21న ఫస్ట్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-1, పార్ట్-2, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న థర్డ్ లాంగ్వేజ్, 26న మాథమెటిక్స్, 28న సైన్స్ పార్ట్-1 ఫిజికల్ సైన్స్, 29న సైన్స్ పార్ట్-2 బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్, 3న ఓ ఎస్ ఎస్ సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సాన్ఇట్ అండ్ అరబిక్), ఎస్ ఎస్ సి ఒకేషనల్ కోర్స్ (థియరీ), 4న ఓ.ఎస్.ఎస్సి. మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సాన్స్టిట్ అండ్ అరబిక్) పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఇందు కొరకు జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 49 మంది ముఖ్య పర్యవేక్షకులు, 49 మంది శాఖ అధికారులు, 4 సి సెంటర్ కస్టోడియన్లు, 461 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందని తెలిపారు. 9 వేల 189 మంది రెగ్యులర్, 221 మంది ఒక్కసారి అనుత్తీర్ణులైన విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష సమయంలో 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రంలోనికి మొబైల్, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం జరుగదని, విద్యార్థులు పరీక్షా సమయానికి కంటే ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్ష సమయానికి అనుకూలంగా టిజిఎస్ ఆర్టిసి అధికారులు బస్సు సౌకర్యం కల్పించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు పర్యవేక్షించాలని, ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బందిని నియమించి, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, ప్రశ్నా, జవాబు పత్రాల సురక్షిత రవాణా కొరకు తపాలా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆయా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలోని పరీక్ష కేంద్రాలలో త్రాగునీరు, పారిశుద్ధ్యం నిర్వహణ పకడ్బంధీగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో 5 రూట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రశ్నా, జవాబు పత్రాల తరలింపు సమయంలో ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ తప్పనిసరిగా ఉండాలని, 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో వార్షిక పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా, హరీష్ రాజ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య, మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





