నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్) : తెలంగాణ శాసనసభ సమావేశాలలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదింప చేయడం అభినందనీయమని వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, విశ్వకర్మ సంఘం జిల్లా నాయకుడు పోలోజు శ్రీనివాస్ విశ్వకర్మ వ్యాఖ్యానించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ సర్కార్ తీసుకుందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు అనివార్యంగా అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతునివ్వాల్సి వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కులగణన సర్వే చేపట్టి, బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జనాభా లెక్క పక్కాగా తేల్చి, విద్య, ఉద్యోగ, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షణీయమని ఆయన వెల్లడించారు. బీసీ బిల్లు ఆమోదంపై తెలంగాణ రాష్ట్ర యావత్ బీసీలంతా కాంగ్రెస్ సర్కారుకు రుణపడి ఉంటారని ఉద్ఘాటించారు.





