నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : సూర్యాపేట జిల్లాలో పట్టణాలు, గ్రామాలు, తండాలలో గుడుంబా ప్రవాహం ఏరులై పారుతుంది. కొన్ని గ్రామాలు గుడుంబా తయారీ కేంద్రాలుగా మారాయి. మధ్య వయసు వారితో పాటు యువకులు సైతం మత్తుకు బానిసలై కుటుంబాలని రోడ్డున పడేస్తున్నారు. చిన్న వయస్సు లోనే తాగుడు కి బానిసలై యువత పెడమార్గం పడుతున్నారు. గుడుంబా పై ఉక్కుపాదం మోపాల్సిన అధికారుల అలసత్వం గుడుంబా తయారీదారులకు వరంలా మారింది. ఇదే అదునుగా వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని తండాల్లో అయితే గుడుంబా తయారీ కుటీర పరిశ్రమగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని కుటుంబాలైతే ఇదే ప్రధాన ఆదాయ వనరుగా చీకటి వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే గుడుంబా కి బానిసైన చాలామంది ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. ఇంట్లో కనిపించిన వస్తువుని కళ్ళ ముందే మాయం చేసి అమ్మి మరో సారా కొట్లో దర్శనమిస్తున్నారు. రాత్రి వెళల్ల వివిధ ప్రాంతాల్ల ఉన్న గుడుంబా విక్రయదారులకు, పదుల సంఖ్యల్లో ఉన్న గుడుంబా అడ్డాలకి వాటర్ క్యాన్ రూపంలో చేరవేస్తున్నారు. గ్రామ స్థాయిలో తయారైన గుడుంబాని కొంతమంది యువకులు కాలేజ్ బ్యాగులలో సర్దుకొని ద్విచక్ర వాహనం పై పట్టణాలకు, గ్రామాలకు చేరుకుంటారు. వీరు చూడడానికి స్టూడెంట్స్ అనుకునేలా ఏమాత్రం అనుమానం రాకుండా ఉంటారు. తండాల నుండి గుడుంబా రవాణా కొనసాగుతుందంటే గుడుంబా డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మత్తులో మగ్గుతున్న యువతరం
గుడుంబా తయారీ, రవాణా వలన సులభంగా డబ్బులు సంపాదిస్తుండడం తో పాటు చెడు ప్రవర్తన పెరగడంతో యువత అదుపు తప్పుతున్నారు. చిన్న వయస్సులోనే తాగుడికి బానిసలై కుటుంబాలని రోడ్డున పడేస్తున్నారు. కొందరైతే, అకాల మరణంతో భార్య-పిల్లల్ని అనాధల్ని చేసేవారు మరికొందరు .శాంతి భద్రతల సమస్యలు కూడా పెరిగాయి. చిల్లర దొంగతనాల సంఖ్య కూడా రోజు,రోజుకు పెరుగుతుంది. ఎక్కువ రేటు మద్యం కొనలేని పేదవారే, కూలి నాలి చేస్తూ బ్రతుకు పోరాటం చేసే వారే బాధితులుగా మారుతున్నారు.





